రామ్ నాథ్ కోవింద్ కు అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం..

భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈసందర్భంగా కోవింద్ ప్రసంగిస్తూ.. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా అభివర్ణించారు పార్లమెంట్ చర్చల సమయంలో ఎంపీలు ఎల్లప్పుడూ గాంధీతత్వాన్ని అనుసరించాలని కోరారు. ప్రజల సంక్షేమానికి ఏది అవసరమో దానినే ఎంచుకోవాలని సూచించారు. రాష్ట్రపతిగా దేశానికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటానన్న కోవింద్.. తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముని హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
ఇక ఈ కార్యక్రమంలో రామ్‌నాథ్ కోవింద్ దంపతులు, తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, పద్మ అవార్డు గ్రహీతలు, ముర్ము సామాజిక వర్గానికి చెందిన గిరిజన, ఆదివాసీ తెగలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ విందుతో తెలంగాణకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత, కిన్నెర కళాకారుడు మొగులయ్య హాజర్యారు. విందులో పాలుపంచుకున్న ఆయనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫొటో దిగారు. ద్రౌపది ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా సోమవారం (జులై 25)న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జులై 18న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి అయిన ముర్ము.. ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా పై ఘనవిజయం సాధించారు. దీంతో దేశ అత్యున్నత పదవిని అధిరోహించే తొలి ఆదివాసీ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.