ఆత్మహత్యకు యత్నించిన MGM పీజీ వైద్య విద్యార్థిని ఆరోగ్యం విషమం

కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్తీషియా చదువుతున్న డాక్టర్ ధరావత్ ప్రీతి బుధవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రమాదకర ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విధుల్లో ఉన్నపుడే హానికరమైన ఇంజక్షన్ ను తీసుకున్నారు.

కాగా రెండు రోజుల క్రితం ఒక సీనియర్ వైద్యులు డాక్టర్ ప్రీతిని వేధించినట్లుగా సమాచారం. దీనిపై ఆమె ఫిర్యాదు చేయడంతో కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వేధింపులకు గురి చేసిన వైద్యుడిని మందలించారు. అయినప్పటికీ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈమెకు హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు.

ప్రీతికి వైద్యం అందించేందుకు ఐదుగురు వైద్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమెను కాపాడేందుకు డాక్టర్ పద్మజ నేతృత్వంలో ఈ బృందం తీవ్రంగా శ్రమిస్తోందని వివరించారు. అయితే, చికిత్సకు ప్రీతి శరీరం స్పందించడంలేదని వైద్యులు తెలిపారు. బీపీ, పల్స్ రేట్ నమోదు కాని పరిస్థితి ఉందని చెప్పారు.

వరంగల్ నుంచి హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలిస్తుండగా రెండుసార్లు ప్రీతి గుండె ఆగిపోయిందని డాక్టర్లు తెలిపారు. డాక్టర్లు సీపీఆర్ చేసి గుండె మళ్లీ కొట్టుకునేలా చేశారన్నారు. ఇంజక్షన్ ద్వారా మత్తుమందు హై డోస్ లో తీసుకోవడం వల్ల ప్రీతి శరీరంలో డ్యామేజీ తీవ్రంగా ఉందన్నారు. అంతర్గతంగా అవయవాలు బాగా దెబ్బతిన్నాయని, మెదడుపైనా మత్తుమందు ప్రభావం ఎక్కువగా ఉందని వివరించారు. ప్రస్తుతం ప్రీతిని ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు.