కేసీఆర్..గాలిమోటార్ లో వ‌చ్చి.. గాలి మాటలు చెప్పి వెళ్లిపోయాడు – షర్మిల

వరద ముంపు పర్యటనలో భాగంగా ఈరోజు షర్మిల భద్రాచలంలో పర్యటించారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఫై నిప్పులు చెరిగారు. గాలిమోటార్ లో వ‌చ్చి.. గాలి మాటలు చెప్పి వెళ్లిపోయాడు, వరదలకు కారణం క్లౌడ్ బస్టర్ అని కేసీఆర్ అంటే.. కాదు పోలవరం కారణమని ఓ కంత్రి మంత్రి అంటాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం కారణమైతే మరి ఇన్నేండ్లు ఎందుకు మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. ఇద్దరు కలిసి భోజనం చేశారు కదా.. పోలవరంపై మాట్లాడుకునే సమయం లేదా అని జగన్ – కేసీఆర్ లను ఉద్దేశించి షర్మిల కామెంట్స్ చేసారు.

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా.. భద్రాచలం కరకట్టను కేసీఆర్ ఎందుకు కట్టలేదని షర్మిల ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా సీఎంగా ఉండి.. భ‌ద్రాచ‌లానికి ఒక్క మంచి ప‌ని చేయ‌లేదని విమర్శించారు. గాలిమోటార్ లో వ‌చ్చి.. గాలి మాటలు చెప్పి వెళ్లిపోయాడు త‌ప్ప.. ఒక్క కాల‌నీ తిర‌గ‌లేదని, క‌ట్ట మీద నిల‌బ‌డి పిట్ట క‌థ‌లు చెప్పారని షర్మిల విమర్శించారు. విదేశీ కుట్ర‌లు, క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటూ కొత్త క‌థ అల్లారని ఎద్దేవా చేశారు. గుట్ట మీద కాల‌నీ క‌డ‌తాడ‌ట‌.. తాత‌ముత్తాల ఇండ్ల‌ను వ‌దిలి గుట్ట మీదికి పోవాల‌ట‌ అని కామెంట్ చేశారు. దీని బ‌దులు క‌ర‌క‌ట్ట ఎత్తు పెంచితే సరిపోయేది క‌దా అని అన్నారు. భారీ వ‌ర‌ద‌ల‌తో పేదల బతుకులు చిందరవందరగా మారినా.. కూడు, గూడు లేక అల్లాడుతున్నా.. బుర‌ద‌లోనే జ‌నం జీవ‌నం గ‌డుపుతున్నా స‌ర్కారుకు సోయి లేదా అని ప్రశ్నించారు.