అసెంబ్లీలో విజిల్ ఊదుతూ ప్రభుత్వంపై బాలకృష్ణ నిరసన

ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందేనన్న అంబటి

Balakrishna protests against the government by blowing the whistle in the assembly

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో రిమాండ్ కు వెళ్లిన తర్వాత… ఆ పార్టీ ఎమ్మెల్యే బాలకృష్ణ పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ అయ్యారు. పార్టీని ముందుండి నడిపించే బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. టిడిపి సభ్యులతో కలిసి ఆయన స్పీకర్ పోడియంలోకి వెళ్తున్నారు.

ఈరోజు సభలో చంద్రబాబు సీటుపైకి ఎక్కి విజిల్ ఊదారు. విజిల్ ఊదుతూ ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు విజిల్ ఊదిన బాలయ్యపై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. చంద్రబాబు సీటుపైకి ఎక్కడం ఎందుకు, ఆ సీట్లో కూర్చోవాలని అన్నారు. తండ్రిని చంపిన బావ కళ్లలో ఆనందం చూసేందుకు బాలకృష్ణ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల తర్వాత ఇంటికి వెళ్లి విజిల్ ఊదుకోవాల్సిందేనని చెప్పారు.

మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ పై టిడిపి సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించారు. దీంతో, టిడిపి సభ్యులు తన నిరసనను మరింత తీవ్రతరం చేశారు. ఇంకోవైపు, శాసనమండలిలో సైతం టిడిపి సభ్యులు ఆందోళనను కొనసాగిస్తున్నారు.