తెలంగాణ లో మళ్లీ వర్షాలు..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

తెలంగాణ లో మరోసారి వర్షాలు పడబోతున్నాయి. గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడిన సంగతి తెలిసిందే. ఈ వర్షాల దాటికి రాష్ట్రం అతలాకుతలమైంది. ఎక్కడ డ్యామ్ లు తెగిపోతాయో అనే రీతిలో భారీ వరదలు ముచ్చేత్తాయి. అంతే కాదు ప్రాణం , ఆస్థి నష్టం కూడా వాటిల్లింది. ఇక ఈ క్రమంలోనే మరోసారి రాష్ట్రంలో వర్షాలు పడబోతున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వచ్చే ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం శాఖ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మేడ్చల్‌, నల్లగొండ, రంగారెడ్డి, సూర్యాపేట, హైదరాబాద్‌, జనగామ, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఈ మేరకు ఎల్లో, గ్రీన్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఏపీలోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.