తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడబోతున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ. రాబోయే మూడ్రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇటు తెలంగాణ లో కూడా భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న ఐదు రోజుల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

4,5వ తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. అలాగే 6వ తేదీ రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అలర్ట్ జారీ చేసింది.

ఇటు ఏపీలో 3,4వ తేదీల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. సోమవారం కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఇక అదే రోజు అల్లూరి సీతారామరాజు, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వానలు కురుస్తాయంది. ఇక 4వ తేదీ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. 4న పల్నాడు, బాపట్ల, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేశారు. అలాగే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, తిరుపతి, కృష్ణ, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, నంద్యాల, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.