కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మరో షాక్ ఇచ్చిన జగన్ సర్కార్

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి మరో షాక్ ఇచ్చిన జగన్ సర్కార్. గత కొద్దీ రోజులుగా సొంత పార్టీ ఫై ఆరోపణలు చేస్తూ..రీసెంట్ గా పార్టీ నుండి బయటకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి సంబదించిన సెక్యూరిటీ ని తగ్గించింది. ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్లను 1+1 కి తగ్గించింది. టీడీపీలో చేరడానికి నిర్ణయం తీసుకుని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని వైస్సార్సీపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై అలాగే వైస్సార్సీపీ నాయకత్వంపై విమర్శలు చేసిన నాలుగైదు రోజుల్లోనే శ్రీధర్ రెడ్డి భద్రతను తగ్గించడం రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది.

ఓ పక్క వైస్సార్సీపీ నేతలు కోటంరెడ్డి ఫై విమర్శలు , బెదిరింపులు చేస్తున్నప్పటికీ ఆయన మాత్రం ఎక్కడ తగ్గడం లేదు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా నెల్లూరు మేయర్ స్రవంతి కూడా అధిష్టానానికి షాక్ ఇచ్చారు. తాను కూడా కోటంరెడ్డి బాటలోనే నడుస్తానని మీడియా సమావేశంలో తెలిపారు. కోటంరెడ్డి వెంటే తన ప్రయాణం అని అన్నారు. కార్పొరేటర్‌గా.. మేయర్‌గా ఎన్నికయ్యేందుకు కోటంరెడ్డినే కారణమని ఆమె చెప్పారు. అవసరం అయితే కోటంరెడ్డి కోసం తాను మేయర్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

శ్రీధరన్నతోనే నా రాజకీయ ప్రయాణం.. అని మేయర్‌ స్రవంతి చెప్పగా.. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చలించిపోయారు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఇటీవల కోటంరెడ్డి వరుసగా ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ వీడుతున్నట్లు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ప్రెస్‌మీట్లకు మేయర్ భర్త కూడా హాజరయ్యారు. శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్లో మేయర్ స్రవంతితో కలిసి వచ్చారు. తాను ఒంటరిగా పార్టీ నుంచి వెళ్లిపోవడం లేదని శ్రీధర్ రెడ్డి పరోక్షంగా అధిష్టానికి హెచ్చరిక పంపించారు.