నేడు ఖమ్మం లో వంద ఎకరాల్లో కాంగ్రెస్ జన గర్జన భారీ సభ

తెలంగాణ లో ఎన్నికల వేడి మొదలైంది. మొన్నటివరకు బిజెపి – బిఆర్ఎస్ గా ఉండేది కానీ ఇప్పుడు కాంగ్రెస్ – బిఆర్ఎస్ గా మారబోతుంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం తో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇప్పుడు ఆ ఉరకలు మరింత స్పీడ్ అయ్యేలా మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు జూపల్లి మొదలగువారు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు.

నేడు ఖమ్మంలో దాదాపు వంద ఎకరాల్లో కాంగ్రెస్ జన గర్జన భారీ సభ నిర్వహిస్తుంది. ఈ సభ కు ముఖ్య అతిధిగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరుకాబోతున్నారు. ఇదే సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటు జూపల్లి మొదలగువారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అలాగే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సైతం నేటితో ముగుస్తుండడం తో సభ వేదిక ఫై భట్టి ని సన్మానించబోతున్నారు.

ఇప్పటికే ఖమ్మం నగరం చుట్టూరా కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్స్, భారీ ఫ్లెక్సీలతో కాంగ్రెస్‌లో సరికొత్త సందడి సంతరించుకుంది. మధ్యాహ్నం తర్వాత దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరుకోనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఖమ్మం చేరుకుంటారు. బహిరంగ సభా వేదికకు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగి సభలో పాల్గొంటారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను ఉద్దేశించి రాహుల్.. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపనున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు అన్ని జిల్లాల నుంచి దాదాపు 5 లక్షల మంది వరకు జనసమీకరణ చేసి తమ సత్తా చాటాలని భావిస్తున్నారు. రాహుల్‌గాంధీతోపాటు కర్నాటక డీప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంతరెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఏఐసీసీ, పీసీసీ నేతలు ఈ సభకు హాజరుకానున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు మరికొందరు ఇతర జిల్లాల నేతలు అదే సభలో కాంగ్రె్‌సపార్టీలో చేరబోతుండటంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఈసభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న తరుణంలో ఖమ్మంలో పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవని పోస్టర్ల ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఖమ్మంలో పలు చోట్ల ఈ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్‌పై బీఆర్ఎస్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆ పోస్టర్లలో హెచ్చరికలు జారీ చేశారు.