ఫోన్‌ ట్యాపింగ్‌ ఘటన.. పలువురు పోలీస్‌ అధికారుల ఇళ్లలో సోదాలు

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రాష్ట్ర నిఘా విభాగంలోని స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ లో డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావును విధుల నుంచి తప్పించటంతో పాటు అరెస్టు కూడా చేశారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ప్రతిపక్ష నేతలు, కీలక అధికారులు వారి బంధువుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆధారాలు లభించటంతో ప్రణీత్ రావును అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా.. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.

ఈ కేసులో పలువురు అధికారుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు, ఎస్‌ఐబీ డీఎస్పీ తిరుపతన్న, భూపాలపల్లి అడిషనల్‌ ఎస్పీ భుజంగరావు నివాసాల్లో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌ సిటీ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు ఇంటితోపాటు మొత్తం 10 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు.