ఉగ్రదాడి పై రష్యాను ముందే హెచ్చరించాంః అమెరికా

US Warned Russia Of Planned Terror Attack A Month Ago: White House

వాషింగ్టన్‌ః రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు. ఈ ఘటనలో 60కిపైగా ప్రాణాలు కోల్పోగా 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి తమ పనేనని కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ప్రకటించింది. ఈ ఉగ్ర ఘటనపై తాము ముందుగానే రష్యాను హెచ్చరించినట్టు అమెరికా పేర్కొంది. మ్యూజిక్ కన్సర్ట్ వంటి పెద్ద ఎత్తున జనం గుమికూడే ప్రదేశాల్లో ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని, కాబట్టి అప్రమత్తంగా ఉండాలని ఈ నెల మొదట్లోనే రష్యాను హెచ్చరించినట్టు అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి అడ్రీన్ వాట్సన్ తెలిపారు.

‘డ్యూటీ టు వార్న్’ విధానంలో భాగంగా బైడెన్ ప్రభుత్వం తమకు అందే ఇంటెలిజెన్స్ సమాచారాన్ని ఇతర దేశాలతో పంచుకుంటుందని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా కిడ్నాపులు, ఎక్కువమందిని హత్యచేయాలన్న పథకాలపై శీఘ్రంగా స్పందించి ఆయా దేశాలకు సమాచారం అందిస్తుందని వివరించారు. అమెరికా ముందుగానే హెచ్చరించినప్పటికీ పుతిన్ ప్రభుత్వం అప్రమత్తం కాకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెబున్నారు.