రాహుల్ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. మే 6, 7 తేదీల్లో రాహుల్ గాంధీ తెలంగాణ లో పర్యటించబోతున్నారు. మే 6న ఢిల్లీ నుంచి మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనున్నారు. ఆ తరువాత వరంగల్ ఆర్ట్స్ కాలేజీలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. మే 7న బోయిన్ పల్లిలో జరిగే సమావేశంలో పాల్గొనన్నారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యోగాలు రాక ఆత్మహత్య చేసుకున్న యువకుల కుటుంబాలతో, రైతుల కుటుంబాలతో రాహుల్ సమావేశం కానున్నారు.

ఆతరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణలో 40 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని, ఈ రోజుతో మెంబర్​షిప్​ డ్రైవ్​ ముగిసిందన్నారు. సభ్యత్వాలు కట్టిన వారికి ఇన్సూరెన్స్​ సొమ్ము చెల్లించామని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ తెలిపారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో తెలంగాణపై పూర్తి ఫోకస్ పెట్టింది. వరసగా తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు రాహుల్ గాంధీ. రెండు సార్లు తెలంగాణ నేతలతో భేటీ నిర్వహించారు. పార్టీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించారు. అసంత్రుప్తిగా ఉన్న జగ్గారెడ్డితో కూడా పర్సనల్ గా భేటీ అయ్యారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సమసిపోయాయని ఓ సంకేతం కార్యకర్తల్లోకి వెళ్లింది.