ఖమ్మంలో విషాదం : పోలీసుల టార్చర్‌ తట్టుకోలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ ఆత్మహత్య

BJP Activist Dead Commits Suicide

ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వేధింపులకు బీజేపీ కార్యకర్త సాయి గణేష్‌ బలయ్యాడు. పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు యత్నించిన సాయి గణేష్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. ఖమ్మం నగరంలోని స్థానిక 37వ డివిజన్ లో నివాసముంటున్న సాయి గణేష్ అనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్త తన డివిజన్ లో పార్టీ దిమ్మను నిర్మించాడు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్ పార్టీ నేతలు దిమ్మను కూల్చడంతో వివాదం చోటు చేసుకుంది. దీనిపై సాయి గణేష్ త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సాయి గణేష్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించలేదు. అంతేకాకుండా సాయి గణేషన్ ఇష్టారీతిగా తిట్టడంతో మనస్థాపానికి గురై అక్కడే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం గమనించిన పోలీసులు, పార్టీ నాయకులు సాయి గణేష్ ను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అతడి పరిస్థితి విషమించడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆదేశాల మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్ లో మెరుగైన వైద్యం కోసం చేర్పించారు. ఈ క్రమంలో సాయి గణేష్ చికిత్స పొందుతూ మరణించాడు. టీఆర్ఎస్ నేతల ఒత్తిడితోనే తన కొడుకుపై 16 అక్రమ కేసులు పెట్టారని గణేశ్ తల్లి ఆరోపించింది. తన కొడుకు మరణానికి కారణమైన వారిని చర్యలు తీసుకోవాలని తల్లి డిమాండ్ చేసింది. మరోవైపు సాయి గణేశ్ ఆత్మహత్యకు యత్నించడానికి కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు ప్రదర్శనగా ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేశారు. ఈ నెల 18న ఖమ్మంలో కేటీఆర్ పర్యటనను అడ్డుకుంటామని నినాదాలు చేశారు. స్థానిక మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఒత్తిడితోనే పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.