బిగ్ బాస్ 5 : విన్నర్ సన్నీ..రన్నర్ షణ్ముఖ్

అంత అనుకున్నట్లే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ గా సన్నీ నిలిచాడు. రన్నర్ గా షణ్ముఖ్ నిలిచాడు. మొదటి ఎపిసోడ్‌ నుంచి నెగిటివిటి ఎదుర్కొన్న సన్నీ ఆ తర్వాత తన గేమ్‌ స్టైల్‌ని మారుస్తూ టాస్క్‌ల్లో విజయం సాధించడమే కాకుండా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకున్నాడు. ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లను దక్కించుకొని బిగ్‌బాస్‌ 5 టైటిల్‌ను గెలుచుకున్నాడు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ టైటిల్ కోసం 19 మంది పోటీ పడ్డారు. వారిలో సన్నీ ఒక్కడే విన్నర్‌గా నిలిచాడు. సన్నీ కి యాభై లక్షల ప్రైజ్ మనీ, ట్రోపీ, సువర్ణ భూమి వారి సువర్ణ కుటీర్ తరపు నుంచి పాతిక లక్షలు విలువ చేసే భూమి, ఒక టీవీఎస్ బైక్ ను గెలుచుకున్నారు. ఆ అన్నింటినీ కూడా తన తల్లి కళావతితో కలిసే సన్నీ తీసుకున్నారు.

వీజే సన్నీ.. తన ఫైర్ బ్రాండ్‌తో యూత్‌ను ఆకట్టుకున్నాడు. అతను తరచూ మచ్చా, డార్లింగ్ అనే పదాలను వాడటం యూత్‌కు మరింత దగ్గర చేసింది. మచ్చా అనే డైలాగ్ చాలా పాపులరైందంటూ నాగార్జున సైతం కితాబిచ్చాడు. ఫ్రెండ్స్ మధ్య చాలా సాధారణంగా వెలువడే పదాలివి. నేచురల్‌గా ఉండటం, బయట ఎలా ఉంటాడో.. బిగ్‌బాస్ హౌస్‌లోనూ అదే తరహాలో ప్రవర్తించడం అతనికి ప్లస్ పాయింట్ అయింది. అతని డ్రెస్సింగ్ స్టైల్ సైతం యూత్‌ను కట్టిపడేసింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం సన్నీని మరింత చేరువ చేసింది. ఫ్రెండ్‌షిప్ కోసం ఎంతకైనా త్యాగం చేస్తాడని పేరు తెచ్చుకున్నాడతను. ఇదివరకు తనకు దక్కిన ఎవిక్షన్ పాస్‌ను ఆర్జే కాజల్ కోసం వినియోగించడాన్ని దీనికి నిదర్శనం.

ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌ వద్ద పెద్ద ఎత్తున అభిమానులు హంగామా చేస్తున్నారు. రాత్రి మొత్తం సంబరాలు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో సన్నీ అన్నపూర్ణ స్టూడియోస్‌ నుంచి బయటకు రానున్నాడు. విజేతగా నిలిచిన సన్నీని ర్యాలీగా తీసుకెళ్లడానికి ఫ్యాన్స్‌ సిద్ధంగా ఉన్నారు.