తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలతో పోరాడుతుంది – రాహుల్

తెలంగాణ లో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కర్ణాటక లో ఎలాగైతే ఉచిత హామీలతో అధికారంలోకి వచ్చిందో..తెలంగాణ లో కూడా అలాంటి హామీలతో అధికారం చేపట్టాలని చూస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ తుక్కుగూడ లో కాంగ్రెస్‌ విజయభేరి పేరుతో భారీ సభ నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిధిగా సోనియా , రాహుల్ , ఖర్గే లు హాజరు అయ్యారు.

ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలన్నింటితోనూ పోరాడుతోందని వెల్లడించారు. రాజకీయాల్లో మనం ఎవరిపై పోరాడుతున్నామో మనకు తెలిసుండాలని రాహుల్ పేర్కొన్నారు. పార్టీలుగా చూస్తే బీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ వేర్వేరుగానే కనిపిస్తాయి… కానీ, ఇవన్నీ కలిసే ఉన్నాయని స్పష్టం చేశారు. లోక్ సభలో కేంద్రం బిల్లులు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు పలికిందని రాహుల్ ఆరోపించారు. కేసీఆర్ పై బీజేపీ ఎలాంటి కేసులు పెట్టదని, ఎంఐఎం నాయకులపైనా ఎలాంటి కేసులు ఉండవని వివరించారు. కేసీఆర్, ఎంఐఎం నేతలను మోదీ తన సొంత మనుషుల్లా భావిస్తారు కాబట్టే వారిపై కేసులు ఉండవని అన్నారు. ఇక్కడి ప్రభుత్వం ఎంత అవినీతి చేసినా సీబీఐ ఇటువైపు తొంగిచూడదని వ్యాఖ్యానించారు.

ఇక, తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చింది కాంగ్రెస్ పార్టీయేనని రాహుల్ గాంధీ ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుసుకుని సోనియాగాంధీ ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సోనియా ఏం చెబుతారో అది చేసి తీరతారని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి తీరడం ఖాయమని, మరో 100 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్లిపోతుందని, బీజేపీ, ఎంఐఎం ఎంత ప్రయత్నించినా దీన్ని అడ్డుకోలేవని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని ప్రకటించారు.

అంతకు ముందు సోనియా ఆరు గ్యారెంటీ పధకాలను ప్రకటించింది.

మహాలక్ష్మి పథకం..

మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతీ నెలా రూ.2,500
పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం.

రైతు భరోసా..

ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు
వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు
వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌

ఇందిరమ్మ ఇళ్ల పథకం

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం

గృహజ్యోతి పథకం

గృహజ్యోతి పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

చేయూత పథకం

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా
చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్‌

యువ వికాసం

యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్‌ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం ప్రకటించారు.