నిర్భయ దోషుల ఉరి అమలుపై సందిగ్ధత

supreme court
supreme court

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు ఫిబ్రవరి 1న ఉరి శిక్ష అమలు కానున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆ విషయంలో సందిగ్ధత ఏర్పడింది. దీనికి గల కారణం నిర్భయగ కేసులో ఉరిశిక్ష పడిన నలుగురిలో ఒకడైన ముకేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడమే. తాను పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ముకేశ్ సింగ్ సుప్రీంలో తాజాగా పిటిషన్ దాఖలు చేశాడు. ఈ వ్యాజ్యంపై సుప్రీం స్పందిస్తూ.. త్వరలో ఉరికంబానికి ఎక్కబోయే ఖైదీ వేసిన పిటిషన్ కంటే మరేదీ ముఖ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ అప్పీలుకు ప్రాధాన్యం ఇస్తామని చీఫ్ జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ముకేశ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌పై నేటి మధ్యాహ్నం 12:30 గంటలకు త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. నిజానికి నిర్భయ దోషులను ఈ నెల 22నే ఉరి తీయాల్సి ఉండగా, ముకేశ్ సింగ్ సుప్రీంను ఆశ్రయించడంతో ఉరి వాయిదా పడింది. తీహార్ జైలులో ఉరికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముకేశ్ సింగ్ మరోమారు సుప్రీంను ఆశ్రయించడంతో శిక్ష అమలుపై సందిగ్ధత నెలకొంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/