రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు

ప్రధాని మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్‌ సభ జనరల్‌ సెక్రటరీ నోటిఫికేషన్‌ ను రిలీజ్‌ చేశారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్‌ తగిలింది. మరి దీనిపై కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో చూడాలి.

రాహుల్ గాంధీ ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాని మోడీ ఇంటిపేరు వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ ఈ నిర్ణయం తీసుకుంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో ఆయన కర్ణాటకలోని కోలార్ లో రోడ్ షో, భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సమయంలో మోడీ ఇంటిపేరును ప్రస్తావించారు. వేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల పేర్లన్నీ మోడీ ఇంటిపేరుతోనే ఎందుకు ఉంటోన్నాయని ప్రస్తావించారు.

రాహుల్ గాంధీపై నేరారోపణ రుజువు కావడంతో ఆయనపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్ ఊపందుకుంది. బిజెపి కి చెందిన ఎంపీలందరూ ఈ డిమాండ్ లేవనెత్తుతూ వస్తోన్నారు. ఈ క్రమంలో లోక్‌సభ సెక్రటేరియట్ నుంచి సర్క్యులర్ జారీ అయింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది.