ఏప్రిల్ లోపు రాజధాని తరలింపు ఉంటుందిః వైవీ సుబ్బారెడ్డి

అనేక భవనాలు అందుబాటులో ఉన్నాయని వెల్లడి

capital will be moved before April: YV Subbareddy

అమరావతిః ఏపీ రాజధాని విశాఖేనని సీఎం జగన్ ఈరోజు ఢిల్లీలో తమ వైఖరిని బలంగా చాటగా, వైఎస్‌ఆర్‌సిపి నేతలు కూడా ఈ అంశంలో మరింత స్పష్టత ఇస్తున్నారు. టిడిపి చైర్మన్, వైఎస్‌ఆర్‌సిపి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్ లోపు విశాఖకు రాజధాని తరలింపు ఉంటుందని వెల్లడించారు. రాజధాని మార్పుపై తాము విశాఖ గర్జన సభలోనే స్పష్టం చేశామని తెలిపారు. ఏప్రిల్ లోపు న్యాయపరమైన సమస్యలు ఓ కొలిక్కి వస్తాయని భావిస్తున్నామని, విశాఖ నుంచే పరిపాలన జరుగుతుందని చెప్పారు.

అయితే విశాఖ వస్తే ముఖ్యమంత్రి ఎక్కడుంటారన్నది సమస్య కాదని, అనేక ప్రభుత్వ భవనాలు అందుబాటులో ఉన్నాయని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న ఐటీ కంపెనీలను ప్రభుత్వ భవనాలుగా ఉపయోగించుకుంటామని తెలిపారు. సెక్రటేరియట్ గా వినియోగించుకోదగిన భవనాలు కూడా అక్కడ అందుబాటులో ఉన్నాయని వైవీ పేర్కొన్నారు. పైగా, ఉడాకు సంబంధించిన భవనాలు కూడా ఉన్నాయని వివరించారు.