ఎమ్మెల్యే సీతక్కను సచివాలయంలోకి అనుమతించని పోలీసులు

ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కు తెలంగాణ సచివాలయంలో చేదు అనుభవం ఎదురైంది. ప్రజల సమస్యలను సచివాలయంలో తెలిపేందుకు వచ్చిన ఆమెను సచివాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమెను లోనికి పంపేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు.
సచివాలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో ఆమె కారు దిగి నడుచుకుంటూ లోనికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తోందన్నారు.

వివిధ శాఖలకు సంబంధించిన పనులపై తాను సచివాలయానికి వచ్చానని, లోపలికి వెళ్తుంటే పోలీసులు తనను అడ్డుకున్నారన్నారు. సచివాలయ నిర్మాణాన్ని ఈ ప్రభుత్వం ఎంతో గొప్పగా చూపిస్తోందని, కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను లోనికి ఎందుకు అనుమతించడంలేదని ప్రశ్నించారు. ఇది చాలా అవమానమన్నారు. సచివాలయం కేవలం బీఆర్ఎస్ నేతలకేనా? అని నిలదీశారు. ప్రతిపక్షాలు, ప్రశ్నించే గొంతుకలు రావొద్దని సచివాలయం ముందు బోర్డ్ పెట్టండి అని చురక అంటించారు.