బండి సంజయ్ ఫై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు కేసీఆర్ తీపి కబురు తెలిపిన సంగతి తెలిసిందే. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ఫై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఒక్కో ఎకరాకు రూ. 10 వేల చొప్పున పరిహారం అందిస్తామని కేసీఆర్ ప్రకటించడం కంటి తుడుపు చర్యేనని అన్నారు. ఈ సాయం రైతులకు ఏ మూలకూ సరిపోదన్నారు. అయినా ఇదే గొప్ప సాయమంటూ చెప్పుకోవడం సిగ్గు చేటని బండి విమర్శించారు. కాగా బండి సంజయ్ విమర్శల ఫై మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసారు.

తెలంగాణలో ఫసల్ బీమా అమలు చేయాలని అడుగుతున్న బండి సంజయ్.. ముందు ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పగలవా.. అంటూ హరీశ్ రావు ప్రశ్నించారు. దేశంలోని 10 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు ఫసల్ బీమాను వ్యతిరేకిస్తున్నాయని పార్లమెంట్ సాక్షిగా బీజేపీ కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారని గుర్తు చేశారు. దీనిని బట్టే ఆ పథకంతో రైతులకు పెద్దగా ఉపయోగం లేదని అర్థం కావడం లేదా.. అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

పంట నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకు సీఎం కేసీఆర్ ఎకరాకు రూ. 10 వేల సాయం చొప్పున, రూ. 228 కోట్లు ప్రకటించి రైతు బిడ్డనని మరోసారి నిరూపించుకున్నారు. బీజేపీ నేతలకు ఇది చిన్న సాయంగా కనిపించడం దురదృష్టకరం. దేశంలో ఇంకెక్కడైనా ఇంతకన్నా ఎక్కువ సాయం చేసినట్టు నిరూపించగలరా? అని అడిగారు.

నాడు అన్నదాత ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి, నేడు అదానీ ఆదాయాన్ని డబుల్ చేశారని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అనునిత్యం రైతులను క్షోభకు గురి చేస్తూ, నల్ల చట్టాలు తెచ్చి రైతులను బలి చేసిన చరిత్ర మీది. వ్యవసాయాన్ని పండుగలా చేసి, రైతును రాజుగా చేసిన ఘనత మాది. సాగు, రైతు సంక్షేమం గురించి బీజేపీ నేతలు మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేన‌ని హరీష్ రావు పేర్కొన్నారు.