కరోనాకు క్వారంటైన్‌

హలో డాక్టర్

Quarantine for Corona
Quarantine for Corona

మా అత్తగారి వయస్సు 65 సంవత్సరాలు. ఆమె ఆచారాలు, సాంప్రదాయాలు తూచా తప్పకుండా పాటిస్తుంది. ఆమెకు మూఢనమ్మకాలు, చాదస్తం కొంత ఎక్కువే. కరోనా సమస్య వచ్చినా తరువాత ఆమె మరీ విపరీతంగా ప్రవర్తిస్తోంది. ఆమె భయపడి అతి జాగ్రత్తలతో మమ్మల్ని బాధిస్తోంది.

కరోనా వృద్ధులు, మహిళలు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నది. అలాగే మధుమేహం, కిడ్నీ సమస్యలు, శ్వాసకోశవ్యాధులు, గుండెసమస్యలు ఉన్నవారికి సులభంగా సోకుతుందని భయపడుతున్నది.

తాను వృద్ధురాలు, మహిళ పైగా తనకు మధుమేహం ఉన్నందున కరోనా కబళిస్తుందని వ్యధి చెందుతున్నది. మా అమ్మాయి ద్వారా సాూజిక మాధ్యమాల్లో వచ్చే వచ్చే వదంతులకు విపరీతంగా స్పందిస్తోంది. అలాగే అందులో ఎవరెవరో చెప్పే సూచనలు పాటిస్తూ, మమ్మల్ని పాటించమని ఒత్తిడి చేస్తోంది.

చేతులు కడుక్కుంటే కరోనా వైరస్‌ సోకదని తెలిసి రోజుకు 20, 30 సార్లు చేతులు కడుతున్నది. అలాగే ఇంట్లోని మమ్మల్ని అందరినీ కడగమని బలవంతపెడుతున్నది. గోమూత్రం, పసుపు కలిపిన జలాన్ని వేపాకురెమ్మలతో తడిపి నెత్తిమీద చల్లుకుటే మంచిదని ఒక సిద్ధాంతి చెప్పారు. పూర్వపు రోజుల్లో అమ్మవారు వచ్చినపుడు ఇలాంటి పద్ధతులు ఆచరించి స్వస్థత పొందేవారని ఆయన చెప్పారు.

అప్పటి నుండి రోజుకు పదిసార్లు ఆ నీల్లు తాను చల్లుకుంటూ మా పై చల్లుతున్నది. అలాగే ఎవరేమి చెపితే అది ఆచరిస్తున్నది. తనకు కాలం తీరిపోయిందని, కరోనా రూపంలో తనకు మృత్యువ్ఞ తప్పదని వ్యాకుల పడుతున్నది. రాత్రులు యమభటులు వచ్చినట్లు కలగని యేవేవో మాట్లాడుతున్నది. నేను ఎన్ని విధాలా అవగాహన కల్పించాలని ప్రయత్నించినా వీలు కావడం లేదు.

మా వారు ఏదో పెద్దావిడ సర్దుకుపోదాం అంటున్నారు. మా అబ్బాయి ఒక్కోసారి విసిగిపోయి తిరగబడి మాట్లాడుతున్నాడు. అమ్మాయి మాత్రం నాన్నమ్మతో కలసి వంత పాడుతున్నది. ఆమె చెప్పిన పద్ధతులు ఆచరిస్తే తప్పేమిటని ప్రశ్నిస్తోంది. పద్దతులు పాటిస్తే తప్పేమీ లేదని మాకూ తెలుసు. అయితే దానికి పరిమితులు ఉండాలి కదా!

క్షణక్షణం అతి జాగ్రత్తలు ఆచరించాలంటే కష్టంగా ఉంది. వేడినీళ్లు తాగిగే కరోనా రాదని, నిమ్మరసం కరోనాకు చెక్‌ పెడుతుందని ఎవరో చెప్పడంతో గంటగంటకూ వేడినీటిలో నిమ్మరసం పిండి ఆమె తాగుతూ మమ్మల్ని తాగమంటున్నది.

అలాగే హోమియో మందులు, యునాని, ఆయుర్వేద మందులు తెప్పించి నిలువ ఉంచుకున్నది. దీనికి ముందే 10 కిలోల బ్లీచింగ్‌ పౌడర్‌, 50 పారాసిటమాల్‌ మాత్రలు తెప్పించుకున్నది.

ఆమెలో ఈ అతిజాగ్రత్తలు, మితిమీరిన భయం, లేనిపోని ఆందోళన తగ్గించే మార్గం తెలియక సతమతమవ్ఞతున్నాము. దీనికి తగిన మార్గోపదేశం సూచించండి.

  • ప్రభావతి

అమ్మా! మీ అత్తగారు కరోనా యాంగ్జైటీతో బాధపడుతున్నట్లు భావించాలి. అతి జాగ్రత్తలు, అతి శుభ్రం పాటించడాన్ని అబ్జెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ అంటాము. అలాగే ఏదో ఒక అంశాన్ని తలచుకుని అనవసరంగా విపరీత భయానికి లోనవడాన్ని ఫోబియాగా గుర్తించాలి.

వీటన్నిటిని యాంగ్జైటీ న్యూరోసిస్‌ రుగ్మతలుగా వర్గీకరిస్తారు. అంటే మనసులో తలెత్తే సమస్యలు నాడీవ్యవస్థను విపరీతంగా స్పందించడంగా అర్ధం చేసుకోవాలి. సహజంగా భయం, అతిజాగ్రత్తలు, సెంటిమెంట్లు, మానసిక ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నవారిలో ఇలాంటి రుగ్మతలు తలెత్తుతుంటాయి. ఇలాంటి వారికి సమస్యల పట్ల అవగాహన కల్పించి, ఆత్మవిశ్వాసం పెంపొందిస్తే సరిపోతుంది.

కుటుంబ సభ్యులు, సన్నిహితులు చెప్పినా కుదుటపడని వారికి సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ చేయించాల్సి ఉంటుంది. మంచి అనుభవం ఉన్న సైకాలజిస్టు ద్వారా మా అత్తగారికి కౌన్సిలింగ్‌ చేయిస్తే కరోనా ఆందోళన తగ్గిపోతుంది.

వివేక కల్పన చికిత్స (కాగ్నెటివ్‌ బిహేవియర్‌ థెరపి) ఒత్తిళ్ల నియంత్రణ, ఉపశమన మార్గాల ద్వారా సైకాలజిస్టు ఆమెలోని ఆందోళన తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ కౌన్సిలింగ్‌ వల్ల కూడ మార్పు రాకపోతే సైకియాట్రిస్టు ద్వారా చికిత్స చేయించాల్సి ఉంటుంది.

మీ అత్తగారు విశ్వసించే వాటిని మన సమాజంలో చాలామంది నమ్ముతున్నారు. భారతీయ ఆహార, వ్యవహారాల వల్లనే మనదేశంలో కరోనా వ్యాప్తి జరగలేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. గోవ్ఞ మూత్రం, పసుపు, వేపాకు చిట్కాలను మన పూర్వీకులు పాటించారు.

ఆ రోజుల్లో మసూచి అంటె అమ్మవారు వస్తే ఇంతకంటే వైద్యం లేదు. అమ్మవారు సోకిన వారిని ఒంటరిగా ఉంచి వేపాకు మీద పడుకో పెట్టేవారు. గోమూత్రం, పసుపునీళ్లు వేపరెమ్మలతో చల్లేవారు. అయితే ఈ పద్ధతులు అందరినీ బ్రతికించలేకపోయాయి.

దీనికి వ్యాక్సిన్‌ కనిపెట్టిన తరువాత పూర్తిగా నివారించగలిగాము. అలాగే గతంలో కలరా వచ్చి వందలాది మంది చనిపోయేవారు. వైద్యం అభివృద్ధి చెందిన తరువాత ఆ సమస్య బాగా తగ్గిపోయింది. మన ఆహారం, పద్ధతులు, ఆచార వ్యవహారాలు అన్ని కూడా మంచివే.

ఇవన్నీ జాగ్రత్తలు, నివారణ మార్గాలే తప్ప వైరస్‌ను నశింపలేవు. ఇప్పటి వరకు కోవిడ్‌-19 (కరోనా) వైరస్‌కు మందు కనుక్కోలేదు. దీనిని నివారించే వ్యాక్సిన్‌ కనుగోనే ప్రయత్నాలలో ఉన్నారు.

కాబట్టి అపోహలు, వదంతులు నమ్మి ఆందోళన పెంచుకోవాల్సిన అవసరం లేదు. నిపుణులు సూచించిన సూచనలు, ప్రభుత్వం నిర్దేశించి పద్ధతులు పాటించడమే మంచి మార్గం.

అందరం కలసి స్వీయ నిర్బంధం (క్వారైన్‌టైన్‌) పాటిస్తూ ఇంటిలో ఉంటే చాలు. అలాగే పరిసరాల పరిశుభ్రత, బయటికి వెళ్లివచ్చినప్పుడు చేతుల్ని సబ్బుతో కడుక్కోవడం, మాస్క్‌లు ధరించడంలాంటివి పాటించాలి.

జలుబు, దగ్గు, తుమ్ములు లాంటి లక్షణాలు ఉన్నావారు వైద్య పరీక్షలు చికిత్సలు చేసుకుంటే చాలు.
అయితే మీ అత్తగారికి మాత్రం కౌన్సిలింగ్‌ చేయించండి.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/