చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఖండించారు. నంద్యాలలో అర్ధరాత్రి నుంచి హైడ్రామా చోటు చేసుకుంది. నేటి తెల్లవారుజామున టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు తనను రేపో, మాపో అరెస్ట్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఈ తెల్లవారు జామున నంద్యాలలో బస చేసి ఉన్న క్యాంపు వద్దకు పోలీసు అధికారులు చేరుకున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేసారు. ప్రస్తుతం చంద్రబాబు ను విజయవాడ కు తరలిస్తున్నారు. 3వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తారని తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు శనివారం ఉదయం అరెస్ట్ చేయడాన్ని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి తీవ్రంగా ఖండించారు. ఎఫ్ఐఆర్‌లో చంద్రబాబు పేరు లేదని, అయినా ఆయనను అరెస్ట్ చేయడం అన్యాయమని చెప్పారు. ఆయనను సరైన నోటీసు లేకుండా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. వివరణ తీసుకోకుండా, విధానాలను అనుసరించకుండా అరెస్ట్ చేయడాన్ని గట్టిగా ప్రశ్నించారు. ఆయనను అరెస్ట్ చేయడం సరికాదన్నారు.