వలసదారులతో వెళ్తున్న పడవ మునక..63 మంది మృతి

Migrant boat capsizes off Cape Verde, over 60 feared dead, Senegal ministry says

ఆఫ్రికా: పశ్చిమ ఆఫ్రికా లోని కేప్ వెర్డే దీవుల్లో వలసదారుల తో వెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోవడం తో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 38 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. సెనెగల్‌ నుంచి వలసదారులతో బయలుదేరిన పడవ కేప్‌ వెర్డే ద్వీపానికి 277 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో మునిగిపోయింది. ఇది గుర్తించిన స్పానిష్‌ ఫిషింగ్‌ ఓడ సిబ్బంది వెంటనే కేప్‌ వర్డియన్‌ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.

ఈ పడవ సెనెగల్‌లోని ఫాస్సోబోయ్‌ నుంచి జులై 10న బయలుదేరినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో అందులో 101 మంది ఉన్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. 38 మందిని ప్రాణాలతో రక్షించారు. ప్రమాదంలో గల్లంతైన వారు మృతి చెంది ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వీరంతా పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

కాగా, పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్‌కు వెళ్లే మార్గం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. అయినప్పటికీ కొందరు వలసదారులు చెక్క పడవలపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఏడాది కాలంలోనే సెనెగల్‌ నుంచి వెళ్లే వలసదారుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ఏడాది (2023) మొదటి ఆరు నెలల్లో సముద్రం ద్వారా స్పెయిన్‌కు చేరుకునే ప్రయత్నంలో దాదాపు 1,000 మంది వలసదారులు మరణించినట్లు వాకింగ్ బోర్డర్స్ గ్రూప్ తెలిపింది.