శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్ కు చేదు అనుభవం

శ్రీసత్యసాయి జిల్లాలో సీఎం జగన్ కు చేదు అనుభవం ఎదురైంది. జగన్‌ కాన్వాయ్‌ని తుంపర్తి భూనిర్వాసితులు అడ్డుకున్నారు. నష్టపరిహారంలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ రోడ్డుపై బైఠాయించి సీఎం జగన్‌ కు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సీఎం జగన్ బుధువారం నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. నార్పల నుండి పుట్టపర్తికి తీసుకు వెళ్లే ప్రత్యేక హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో పుట్టపర్తి చేరుకున్నారు.

ఈ సమయంలో ధర్మవరం మండలం పోతులనాగేపల్లి వద్ద జగన్ కాన్వాయ్ ని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది వారిని తప్పించింది. దీంతో జగన్ కాన్వాయ్ ముందుకు సాగింది. పరిహారం ఇప్పించడంలో స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు. తాము సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని, కానీ పోలీసులు తమను తోసేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈరోజు ఉదయం అనంతపురం జిల్లాలో పర్యటించిన జగన్ నార్పలలో ‘‘జగనన్న విద్యా దీవెన’’ పథకం నిధులను విద్యార్థుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ పథకం ద్వారా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.912 కోట్లు జమ చేశారు. జగనన్న వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ విద్యార్థులకు రూ.20 వేలు చొప్పున సాయం అందించారు.