జగన్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ కమిటీని నియమించిన బీజేపీ..

జగన్ ప్రభుత్వంపై చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కమిటీని నియమించారు. ఈ కమిటీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయుల్లో సమస్యలను గుర్తిస్తుంది. గుర్తించిన సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుంది. సీఎం జగన్ చెప్పిన అబద్ధాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కమిటీ కార్యాచరణను రూపొందించారు.

11 మందితో కూడిన ఈ కమిటీ మార్గదర్శకులుగా దగ్గుబాటి పురందేశ్వరి, వై. సత్యకుమార్ ఉంటారు. కన్వీనర్ గా పీవీఎన్ మాధవ్… సభ్యులుగా సీఎం రమేశ్, జీవీఎల్ నరసింహారావు, కొత్తపల్లి గీత, ఐవైఆర్ కృష్ణారావు, వాకాటి నారాయణ రెడ్డి, పీడీ పార్థసారధి, నిమ్మక జయరాజు, వీ శ్రీనివాసబాబులను నియమించారు. కమిటీ సభ్యులను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు.

వైస్సార్సీపీ- బీజేపీ ఒకటేనని ప్రజలు అనుకుంటున్నారని ఆ పార్టీ నేతలు మథన పడుతున్నారు. అందుకే అధికార పార్టీపై పోరాటాన్ని ఉద్ధృతం చేయాలనుకుంటున్నారు. ఇందులో భాగంగానే మద్యం, ఇసుక, మట్టి, విద్యుత్ ప్రాజెక్టులు, విద్యుత్ మీటర్లు, ట్రాన్స్‌ఫార్మాస్, ఆర్డీఎస్ఎస్, భూ ఆక్రమణలు, మైనింగ్, కాంట్రాక్టులు, పోలవరం, పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, సెంటు భూమి పథకంలో అక్రమాలు జరిగాయి. వైజాగ్‌లో భూ ఆక్రమణలు, రిషికొండలో చోటు చేసుకున్న అక్రమాలు… వంటి విషయాలపై బీజేపీ కమిటీ చార్జిషీట్‌లు రూపొందించనుంది. బీజేపీ కమిటీ మే 5వ తేదీ నుంచి కార్యాచరణ ప్రారంభించనుంది. కమిటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పలు చోట్ల స్వయంగా చార్జిషీట్‌లు దాఖలు చేయనున్నారు. రెండు, మూడు రోజుల్లో విజయవాడలో ఈ కమిటీ భేటీ కానుంది.