ఒడిశా రైలు ప్రమాదంపై కింగ్‌ చార్లెస్‌ తీవ్ర దిగ్భ్రాంతి

‘Profoundly shocked’: King Charles III sends condolences on Balasore train tragedy to President Murmu

లండన్‌ః ఒడిశాలోని బాలాసోర్‌ లో గత శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్తు ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనపై ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్‌, జపాన్‌, పాక్‌ సహా పలు దేశాధినేతలు తమ సానుభూతిని తెలిపాయి. తాజాగా బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ III కూడా సంతాపం ప్రకటించారు. ఘోర రైలు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఓ సందేశాన్ని పంపినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ ఓ ప్రకటనలో తెలిపింది.

బాలాసోర్‌ రైలు ప్రమాద వార్త తనని, తన భార్య క్వీన్‌ కెమిల్లాని ఎంతో కలచివేసిందని చార్లెస్‌ పేర్కొన్నారు. ‘బాలాసోర్‌లో జరిగిన భయంకరమైన రైలు ప్రమాద ఘటన వార్తతో నేను, నా భార్య చాలా దిగ్భ్రాంతి చెందాం. చాలా బాధపడ్డాం. ఇంతటి విషాదకరమైన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా హృదయాల్లో భారతదేశానికి, భారత ప్రజలకు ప్రత్యేక స్థానం ఉంది. 1980లో ఒడిశాను సందర్శించి అక్కడి ప్రజలను కలిశాను. ఆ మధురజ్ఞాపకాలు ఇప్పటికీ నాలో ఉన్నాయి’ అంటూ బ్రిటన్‌ రాజు పేర్కొన్నారు.