ఈ వారంలోనే జిన్ పింగ్, పుతిన్ కీలక సమావేశం

17, 18 తేదీల్లో బీజింగ్ లో బెల్డ్ అండ్ రోడ్ ఫోరమ్ భేటీ

A key meeting between Xi Jinping and Putin this week

బిజీంగ్‌ః ఈ వారంలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతంపై ఈ భేటీలో దృష్టి సారించనున్నారు. బీజింగ్ లో ఈ నెల 17-18వ తేదీల్లో బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ జరగనుంది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు. 130 దేశాల ప్రతినిధులు సైతం దీనికి హాజరు కానున్నారు. కానీ భారత్ ఇందులో పాల్గొనకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

2022 ఫిబ్రవరిలో చైనా-రష్యా హద్దుల్లేని ద్వైపాక్షిక బంధాన్ని ప్రకటించడం తెలిసిందే. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడానికి కేవలం కొన్ని రోజుల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాను సందర్శించారు. ఇప్పుడు మరో విడత బీజింగ్ కు రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం విషయంలో ప్రపంచం రెండు ధ్రువాలుగా మారిపోయిన నేపథ్యంలో.. పాలస్తీనాకు మద్దతునిస్తున్న రష్యా, చైనా దేశాల అధినేతల భేటీకి ప్రాధాన్యం నెలకొంది. ఇస్రాయెల్ దాడులను ఇప్పటికే చైనా ఖండించడం గమనార్హం. పాలస్తీనా ప్రత్యేక దేశానికి మద్దతుగా పుతిన్ మాట్లాడారు.