ఢిల్లీలో భారీ వర్షాలు..రాజధానికి వరద హెచ్చరికలు జారీ

Delhi govt issues flood warning after Haryana discharges over 1 lakh cusecs of water into Yamuna from Hat

న్యూఢిల్లీ: గత రెండు రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో యమునా నదికి వరద పోటెత్తింది. నదిలో వరద ప్రవాహం ప్రమాద స్థాయికి చేరింది. అయితే హస్తినకు మరో ముప్పు పొంచి ఉన్నది. రెండు రోజుల్లో ఢిల్లీని భారీ వరద తాకనుంది. ఇప్పటికే రాజధానిలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయాయి. వీటికి ఎగువ రాష్ట్రం నుంచి వచ్చే వరద తోడవనుంది.

హర్యానాలో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం హత్నికుండ్‌ బ్యారేజీ గేట్లను ఎత్తివేసింది. తద్వారా లక్షా 5 వేల 453 క్యూసెక్కుల నీటిని ఆదివారం సాయంత్రం 4 గంటలకు దిగువకు విడుదల చేస్తున్నది. ఇది రెండు రోజుల్లో ఢిల్లీని తాకనుంది. అంటే మంగళవారం మధ్యాహ్నం వరకు యమునా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహించనుంది. నగరంలోని ఓల్డ్‌ రైల్వే బ్రిడ్జి వద్ద ప్రస్తుతం 203.18 మీటర్ల మేర వరద ప్రవహిస్తున్నదని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ తెలిపింది. బ్రిడ్జి ప్రమాద స్థాయి 204.5 మీటర్లు అని అధికారులు తెలిపారు.

అయితే హర్యానా నుంచి వచ్చే నీరు యమునా నదిలో కలిస్తే వరద ప్రవాహం 205.5 మీటర్లకు చేరుకుంటుందని చెప్పారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య యమునా నది ప్రమాద స్థాయికి మించి ప్రవహించనుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి సెంట్రల్‌ కంట్రోల్‌ రూమ్‌తోపాటు 16 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేసింది.

కాగా, దేశ రాజ‌ధానిలో 41 ఏండ్ల గ‌రిష్టస్ధాయిలో వ‌ర్షపాతం న‌మోదైంది. ఢిల్లీలో ఒకేరోజు 153ఎంఎం వ‌ర్షపాతం న‌మోద‌వ‌డంతో 1982 త‌ర్వాత ఈ స్ధాయిలో వ‌ర్షాలు కుర‌వ‌డం ఇదే తొలిసారని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఈ వ‌ర్షాకాలం సీజ‌న్‌లో ఢిల్లీలో ఇదే అత్యధిక వ‌ర్షపాతమ‌ని అధికారులు తెలిపారు. భారీ వ‌ర్షాలు కొన‌సాగే అవ‌కాశం ఉండ‌టంతో ఢిల్లీ వాసులు అప్రమ్తతంగా ఉండాల‌ని ఐఎండీ య‌ల్లో అల‌ర్ట్ జారీ చేసింది.

కుండ‌పోత‌తో దేశ రాజ‌ధానిలోని పార్కులు, అండ‌ర్‌పాస్‌లు, మార్కెట్లు, హాస్పిట‌ల్ ప్రాంగ‌ణాలు, మాల్స్ స‌హా వాణిజ్య సంస్ధల ప్రాంగ‌ణాలు నీట‌మునిగాయి. భారీ వ‌ర్షాల‌తో ఢిల్లీ వీధుల‌న్నీ జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. ప్రయాణీకులు, పాద‌చారులు మోకాలి లోతు నీళ్లలో గ‌మ్యస్ధానాల‌కు చేరుకుంటున్న ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో ప్రత్యక్షమ‌య్యాయి. గురుగ్రాం సైతం భారీ వ‌ర్షాల‌తో వ‌ణికింది. రోడ్లన్నీ జల‌మ‌యం కావ‌డంతో వాహ‌న‌దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.