ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు

ఈ నెల 12 న ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ తో పాటు NDA కూటమి నేతలు , అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రాబోతున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ పర్యటన కు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల అయ్యింది. ఈ మేరకు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రధాని పర్యటన కు సంబదించిన వివరాలు వెల్లడించారు.

ప్రధాని మోడీ ఈ నెల 12 తేదీ ఉదయం 8.20 గం.లకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉ.10.40.గం.లకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారని తెలిపారు. ఉదయం10.55 కు అక్కడకు సమీపంలోని ఐటి పార్కు ప్రాంగణానికి చేరుకుని 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గోంటారని వెల్లడించారు. అనంతరం ప్రధాని 12.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి భువనేశ్వర్ వెళతారని పేర్కొన్నారు.

విజయవాడ నుంచి గన్నవరం మధ్యలోని కేసరపల్లిలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి వేదికగా నిర్ణయించారు. పక్కనే జాతీయ రహదారికి తోడు సమీపంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం, విజయవాడ నుంచి రాకపోకలకు సౌలభ్యంగా ఉండటంతో కేసరపల్లిని ఈ మెగా ఈవెంట్ కు వేదికగా తీర్చిదిద్దుతున్నారు. సుమారు 14 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను, ఇరువైపులా భారీ షెడ్లను నిర్మిస్తున్నారు. వేలాదిమంది కార్మికులు రాత్రి, పగలు తేడా లేకుండా పనులు చేపడుతున్నారు.