నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోమవారం అనకాపల్లి లోని నూకాంబికా అమ్మవారిని దర్శించుకున్నారు. పిఠాపురంలో తాను గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నూకాంబికా అమ్మవారిని దర్శించుకుంటానని అనకాపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పవన్‌ అన్నారు. అన్నమాట ప్రకారం ఈరోజు ఢిల్లీ నుండి నేరుగా ప్రత్యేక విమానంలో విశాఖ కు చేరుకొని అక్కడి నుండి అనకాపల్లి కి వచ్చి నూకలమ్మను దర్శించుకున్నారు. పవన్​తో పాటుగా ఎంపీ సిఎం రమేష్ సైతం నూకాంబికా ను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి , తీర్థప్రసాదాలు అందజేశారు.

పిఠాపురం నుంచి బరిలో నిలిచిన పవన్‌ కల్యాణ్‌ ఘన విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల తేడాతో రికార్డు విజయం నెలకొల్పారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ తెనాలి నుంచి విజయం సాధించారు. మరోవైపు, 21 స్థానాల్లో పోటీచేసిన జనసేన దాదాపు అన్ని సీట్లనూ గెలుచుకొని చరిత్ర సృష్టించింది.