రోడ్డు ఫై ప్రజాపాలన దరఖాస్తులు..షాక్ లో స్థానికులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు నుండి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు. వీటిని పరిశీలించి పథకాలను అందజేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి 30 లక్షల మంది గ్యారెంటీ పధకాలను దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వీటిని అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ చేస్తుంది. ఈ క్రమంలో బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై ప్రజాపాలన దరఖాస్తులు పడి ఉండడం అందర్నీ షాక్ కు గురి చేసింది.

హయత్‌నగర్‌ సర్కిల్‌కు చెందిన అప్లికేషన్లు బాలానగర్‌ ఫ్లైఓవర్‌పై చిందరవందరగా కనిపించడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కూకట్‌పల్లిలోని ప్రైవేట్‌ ఏజెన్సీతో కంప్యూటరీంచేందుకు వేలాది దరఖాస్తులను ర్యాపిడో స్కూటీపై అట్టపెట్టెలో తరలిస్తుండగా తాడు తెగి రోడ్డుపై పడిపోవడం చూసి ప్రజలు ఆందోళన చెందారు. స్థానికులు , వాహనదారులు..ఆ దరఖాస్తులను సేకరించి..సదరు వ్యక్తికి అందజేశారు. స్కూటీపై ఉన్న యువకుడిని సదరు వ్యక్తులు నిలదీశారు. ఇవి ఎక్కడికి..ఎక్కడికి తీసుకెళ్తున్నావు..ఎవరు ఇచ్చారు..వంటివి అరా తీశారు. తాను పాన్‌ డబ్బాలో పని చేస్తానని సదరు యవకుడు పేర్కొన్నాడు. మరి హయత్‌నగర్‌కు చెందిన దరఖాస్తులు ఎక్కడికి తీసుకుపోతున్నావని ప్రశ్నించగా… పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. ఒకసారి ఈసీఐఎల్‌కు చెందిన వ్యక్తినని, మరోసారి రామాయంపేటకు చెందిన వ్యక్తిగా చెప్పాడు. అందరూ గట్టిగా నిలదీయడంతో తనకేమీ తెలియదని, లోకేషన్‌ మ్యాప్‌ ద్వారా వీటిని తరలిస్తున్నాననే విషయాన్ని స్పష్టం చేశాడు. ప్రభుత్వ కార్యాలయాల్లో జాగ్రత్తగా కంప్యూటరీకరించాల్సిన దరఖాస్తులను ఓ ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పజెప్పిన అధికారి తీరుపై మండిపడ్డారు.