మరోసారి హైదరాబాద్ లో పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు బారులు

నాల్గు రోజుల క్రితం ఆయిల్ ట్యాంకర్లు సమ్మె చేయడంతో హైదరాబాద్ లో పెట్రోలు లేక అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డును పెట్టేశాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ కోసం కిలోమీటర్ల మేర వెళ్లి కొట్టించుకున్నారు. పలు బంకుల్లో పెట్రోల్ కోసం ఎక్కువ సంఖ్యలో వాహనదారులు చేరడంతో నగరమంతా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని చక్కదిద్దాల్సిన పరిస్థితి వచ్చింది.

తాజాగా ఈరోజు మరోసారి అలాంటి సమస్యే ఎదురైంది. హైదరాబాద్‌లోని అనేక పెట్రోలు బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. కొన్ని పెట్రోలు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టేశారంటూ వదంతులు కూడా వ్యాపించాయి. దీంతో పెట్రోలు కొట్టించుకుందామని ఎక్కువ మంది వాహనదారులు పెట్రోలు బంకులకు చేరుకుంటున్నారు. దీంతో పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడింది. అయితే ఎటువంటి పెట్రోలు కొరత లేదని యాజమాన్యం చెబుతున్నా వాహనదారులు మాత్రం వినిపించుకోవడం లేదు.