తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రభాస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతిలో నేడు ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో తెల్లవారు జామున సంప్రదాయ దుస్తుల్లో ప్రభాస్..శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు ప్రభాస్ కు స్వాగతం‌ పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనం ఆనంతరం.. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు ప్రభాస్ ను సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ప్రభాస్ గెస్ట్ హౌజ్ కు రాగా ఆయన్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు.

ప్రభాస్ నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురుష్ ..జూన్ 16 న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి లో నేడు భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. సినీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగుల ప్రభాస్‌ హాలోగ్రామ్‌ ను ఈ ఈవెంట్ లో ప్రదర్శించనున్నారు. అయోధ్యను తలపించేలా భారీ సెట్‌ వేశారు.

శ్రీరాముడు, వేంకటేశ్వరస్వామి రెండూ శ్రీమహావిష్ణువు అవతారాలే. దాన్ని దృష్టిలో ఉంచుకునే అటు అయోధ్య, ఇటు తిరుపతిల మధ్య ఆధ్యాత్మిక బంధాన్ని తలపించేలా ఈ సెట్‌ను తీర్చిదిద్దారు. 100 డ్యాన్సర్లు, 100మంది గాయనీ గాయకులు ఆదిపురుష్‌తో పాటు, రామాయణానికి సంబంధించిన గీతాలను ఆలపించనున్నారు. ఇక ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిధిగా చిన జియార్ స్వామి రాబోతున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియం తిరుపతిలో ఈ ఈవెంట్ జరగనుంది.

ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి.