నా వైద్యం ఖర్చంతా అన్నయ్య చిరంజీవి భరించారు – పొన్నంబలం

తమిళ నటుడు పొన్నంబలం చాలామందికి తెలిసి ఉంటాడు. కమల్ హాసన్ , చిరంజీవి , రజనీకాంత్ , నాగార్జున , వెంకటేష్ , బాలకృష్ణ వంటి హీరోల సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. తెలుగు లోను పలు సినిమాలు చేసాడు. రెండేళ్ల క్రితం పొన్నంబలం కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో తనవద్ద చిల్లిగవ్వ కూడా లేకపోవడం తో ఇండస్ట్రీలోని కొంత మంది సెలబ్రిటీల సాయం కోరారు.అందులో చిరంజీవి కూడా ఉన్నారు.

తన స్నేహితుడి ద్వారా చిరంజీవి ఫోన్ నంబర్ సంపాదించిన పొన్నంబలం.. ఆయనకు ఒక మెసేజ్ చేశారట. ‘అన్నయ్య నాకు బాగోలేదు.. మీకు చేతనైనంత సాయం చేయండి’ అని మెసేజ్ పెట్టారట. మెసేజ్ చేసిన పది నిమిషాల తర్వాత పొన్నంబలానికి చిరంజీవి ఫోన్ చేశారట. ఈ విషయాన్ని పొన్నంబలం స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

‘హాయ్ పొన్నంబలం.. ఎలా ఉన్నావు.. ఆరోగ్యం బాగాలేదా.. కిడ్నీ ప్రాబ్లమ్ ఉందా.. నేను ఉన్నాను, కంగారుపడకు.. నువ్వు హైదరాబాద్ వచ్చేస్తావా అని చిరంజీవి నన్ను అడిగారు. నేను రాలేను అన్నయ్య అని చెప్పాను. అయితే చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కి వెళ్లండి.. అన్నీ నేను చూసుకుంటాను అని చెప్పారు. అక్కడికి వెళ్తే కనీసం ఎంట్రీ ఫీజు కూడా తీసుకోలేదు. అక్కడే నాకు వైద్యం అందించారు. నేను ఒక్క రూపాయి కూడా కట్టలేదు. రూ.45 లక్షలు ఖర్చయ్యింది. మొత్తం ఆయనే చూసుకున్నారు. చిరంజీవి అన్న దేవుడిలా వచ్చి నాకు సాయం చేశారు. రామ్ చరణ్ సార్ భార్యదే అపోలో హాస్పిటల్. ఆమె ద్వారానే నాకు వైద్యం అందింది’’ అని పొన్నంబలం భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.