భూ కబ్జా ఆరోపణలపై పొంగులేటి స్పందన

ఖమ్మం శివారులో పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డికి చెందిన ‘ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌’లో ఉన్న 21.50 గుంటల భూమి ‘ఇరిగేషన్‌ స్థలం’ అని సోమవారం ఇరిగేషన్‌, రెవెన్యూ శాఖ అధికారులు తేల్చారు. దీనిపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో చేరిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి మంగళవారం గాంధీభవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలు ఘన స్వాగతం పలికారు. పొంగులేటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం రేవంత్‌రెడ్డితో పాటు పొంగులేటి భేటీ అయ్యారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికల కోసం పార్టీని ఎలా మందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చలు జరిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన పొంగులేటి..భూ కబ్జా ఆరోపణలపై క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్‌లో ఉంటే ఇక న్యాయం… వేరే పార్టీలోకి వెళ్తే ఒక న్యాయమా? అని ఆగ్రహం వ్యక్తం చేసారు. కండువాలు మార్చుకున్నాక ఎవరికి ఎంత భూమి వచ్చిందో బయట పడుతుందన్నారు. తనలాంటి వ్యక్తి 20 గంటల కబ్జా చేశానని నింద మోపడం దారుణమన్నారు. తమ కుటుంబ సభ్యులకు అక్కడ 130 ఎకరాల భూమి ఉందని.. ఉద్దేశపూర్వకంగా కోర్టు సెలవులు చూసి తనను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 14 సంవత్సరాల నుంచి లేని ప్రాబ్లం ఇప్పుడేలా వచ్చిందని ప్రశ్నించారు. ఖమ్మం సభ సక్సెస్ అయ్యిందనే ప్రభుత్వం అక్కసు అంటూ మండిపడ్డారు. దీనిపై న్యాయ స్థానం ద్వారా పోరాటం చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని ఈ నిందలు వేస్తున్నారన్నారు.

తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలైన ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారన్నారు. కల్వకుంట్ల కుటుంబం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. స్కీములు ప్రకటించడం తప్పా నెరవేర్చలేదన్నారు. తెలంగాణ వచ్చి కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికి మంచి జరగలేదని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పులమయం చేసి కల్వకుంట్ల కుటుంబ సభ్యులు బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అందరం బుణపడి ఉన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలు ఉన్నారని.. అందరం కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.