రివర్స్ డ్రామా ఆడకపోతే ఈ పాటికి పోలవరం పూర్తయ్యేది

పోలవరంను జగన్ తాకట్టు పెడుతున్నారు: దేవినేని ఉమ

అమరావతి: కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ తో కలిసి ఆయన పోలవరంను సందర్శించారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమ మాట్లాడుతూ.. జగన్ పై విమర్శలు గుప్పించారు. రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ డ్రామా ఆడకుంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదని అన్నారు. నిర్వాసితులకు అంతా బాగుందని కేంద్ర మంత్రికి చెప్పించడానికి జగన్ ప్రయత్నించారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పునరావాసం కింద ఇళ్ల నిర్మాణాలను ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని స్థితిలో జగన్ ఉన్నారని అన్నారు. పోలవరం నిర్వాసితుల ద్రోహిగా జగన్ మిగిలిపోతారని అన్నారు.

ఇక కేంద్ర జల వనరుల మంత్రి పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వస్తే రాష్ట్ర జల వనరుల మంత్రి అక్కడ లేకపోవడం విడ్డూరంగా ఉందని ఉమ అన్నారు. వైస్సార్సీపీకి 28 మంది ఎంపీలు ఉండి కూడా ఉపయోగం లేదని… దేనికీ ఆర్థిక అనుమతులు పొందలేకపోతున్నారని విమర్శించారు. స్వార్థ ప్రయోజనాల కోసం జగన్ పోలవరంను తాకట్టు పెడుతున్నారని చెప్పారు. బాబాయ్ హత్య కేసు, సీబీఐ, ఈడీ కేసుల నుంచి తప్పించుకునే ఆరాటంలో ఆయన ఉన్నారని దుయ్యబట్టారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/