కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాన మంత్రి పదవిపైనా ఆసక్తి లేదుః ఖ‌ర్గే

విపక్ష భేటీ.. అధికారం దక్కించుకోవడం కోసం కాదని వ్యాఖ్య

Congress not looking for PM post, says Mallikarjun Kharge at Opposition meet

బెంగళూరుః కాంగ్రెస్ అధ్యక్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే ప్రతిపక్ష నేత‌ల స‌మావేశంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ప్ర‌ధాని ప‌ద‌విపై ఆస‌క్తి లేద‌ని ఆయన స్ప‌ష్టం చేశారు. ‘‘కాంగ్రెస్‌కు అధికారంపైనా, ప్రధాన మంత్రి పదవిపైనా ఆసక్తి లేదు. ఈ స‌మావేశం ఉద్దేశం.. అధికారం దక్కించుకోవడం కాదు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం’’ అని చెప్పారు.‘‘మనవి 26 పార్టీలు.. 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. బిజెపికి సొంతంగా 303 సీట్లు రాలేదు.. మిత్రపక్షాల ఓట్లను ఉపయోగించుకుంది. తర్వాత ఆయా పార్టీలను విస్మరించింది’’ అని ఆరోపించారు. తమ మ‌ధ్య కొన్ని విభేదాలున్నా.. అవి సిద్ధాంత‌ప‌ర‌మైన‌వి కాద‌ని విప‌క్ష భేటీలో ఖ‌ర్గే పేర్కొన్నారు. ప్రజా ప్రయోజ‌నాల కోసం చిన్న‌పాటి విభేదాల‌ను మ‌నం ప‌క్క‌న‌పెట్టి పోరాడ‌గ‌ల‌మ‌ని వ్యాఖ్యానించారు. మోదీ హ‌యాంలో అణ‌గారిన వ‌ర్గాల హ‌క్కుల‌ను కాల‌రాస్తున్నార‌ని ఖ‌ర్గే దుయ్య‌బ‌ట్టారు.

కర్ణాటకలోని బెంగళూరులో 26 ప్రతిపక్ష పార్టీల నేతలు సోమవారం సమావేశమైన విషయం తెలిసిందే. రెండో రోజైన మంగళవారం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్నట్లు సమాచారం. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బిజెపిని దీటుగా ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన వ్యూహాల‌ను ఈ భేటీలో ఖ‌రారు చేయ‌నున్నారు. యూపీఏ పేరు మార్పు విష‌యంలోనూ క‌స‌ర‌త్తు సాగిస్తున్నారు. నాలుగైదు పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న నేత‌లు.. నేడు నూత‌న కూట‌మి పేరును ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఈ కూటమికి చైర్ పర్సన్ గా సోనియా గాంధీని నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.