పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి కీలక పదవి ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం

కర్ణాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం తో కాంగ్రెస్ పార్టీ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే జోష్ తో తెలంగాణ ఎన్నికల్లో కూడా విజయం సాధించాలని చూస్తుంది. త్వరలో ఎన్నికలు జరగబోతుండడం తో అధిష్టానం నేతలకు పలు కీలక బాధ్యతలు అప్పజెపుతుంది. ఈ క్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీని పార్టీ హైకమాండ్ శుక్రవారం రాత్రి ప్రకటించింది.

టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కీని నియమించగా… రీసెంట్ గా కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కీలక పదవిని అప్పగించారు. ప్రచార కమిటీ కోఛైర్మన్ గా ఆయనను నియమించారు. కన్వీనర్ గా సయ్యాద్ అజ్మతుల్లా హుస్సేనీని ప్రకటించారు. మరో 37 మందిని ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా నియమించారు. పీసీసీ ప్రెసిడెంట్, సీఎల్పీ లీడర్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, శాసనమండలిలో పార్టీ నేత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, డీసీసీ ప్రెసిడెంట్లు, రాష్ట్రానికి చెందిన వివిధ విభాగాలు, శాఖలు, సెల్స్ అధ్యక్షులను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటించారు.

మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలను పర్యవేక్షించేందుకు లోక్ సభ నియోజకవర్గాల వారిగా ఏఐసీసీ పరిశీలకులను నియమించింది. వీరి నియామకం ప్రతిపాదనకు జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఆమోదం తెలిపినట్లు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు.