జగన్ ఫై దాడిని ఖండించిన రాజకీయ పార్టీల నేతలు

ఏపీ సీఎం జగన్ ఫై శనివారం రాత్రి దాడి జరిగిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్‌ కనుబొమ్మకు తాకింది. ప్రస్తుతం జగన్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ దాడిని రాజకీయ పార్టీలు ఖండిస్తున్నాయి.

సీఎం జగన్‌ త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. దాడి ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ జగన్‌పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా, ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపించి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఈసీని కోరుతున్నానని అన్నారు. రాజకీయ విభేదాలు హింసకు దారి తీయకూడదని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ హితవు పలికారు. జగన్‌ త్వరగా కోలుకోవాలని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌లో ఆకాంక్షించారు. జగన్‌పై రాయి విసిరిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషుల్ని కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే నాగబాబు సైతం జగన్ ఫై జరిగిన దాడిని ఖండించారు.