సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పుల కలకలం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు జరగడం సంచలనంగా మారింది. ముంబయిలోని బంద్రాలో ఆయన నివాసం బయట ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించినట్టు పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనంపై వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి.. పలు రౌండ్ల పాటు గాల్లోకి కాల్పులు జరిపి.. అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.. తక్షణమే రంగంలోకి దిగారు. కాల్పుల జరిపిన ఆగంతకుడ్ని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు.. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

సల్మాన్ ఖాన్‌ను మట్టుబెడతామంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ, గోల్డీ బ్రార్‌లు గతంలో అనేక మార్లు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు గ్యాంగ్‌స్టర్లు ఇప్పటికే తమ షూటర్లను ముంబైకి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 2018లో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు సంపత్ నెహ్రా సల్మాన్ ఖాన్‌ ఇంటి ముందు రెక్కీ నిర్వహించాడు. అయితే, అతడు దాడికి తెగబడకముందే పోలీసులకు చిక్కడంతో సల్మాన్‌‌పై దాడి ప్లాన్ పోలీసులకు తెలిసింది. సల్మాన్‌కు ప్రాణహాని పొంచి ఉన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఆయన ఇంటిముందు మూడు షిఫ్టుల్లో పహారా కాస్తున్నారు. మరోవైపు, సల్మాన్‌కు ఆయుధ లైనెన్స్ కూడా మంజూరైంది. వ్యక్తిగత ఆయుధాన్ని నిత్యం వెంట తీసుకెళ్లేందుకు సల్మాన్‌కు పోలీసులు అనుమతించారు.