మ‌హారాష్ట్ర అసెంబ్లీ రద్ధయ్యే అవకాశం ..సంజ‌య్ రౌత్ ట్వీట్‌

ముంబయి: మహారాష్ట్రలో అధికార సంకీర్ణానికి నేతృత్వం వహిస్తున్న శివసేన.. అసెంబ్లీ రద్దు దిశగా సంకేతాలు ఇస్తోంది. శివసేనకు చెందిన మంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో సుమారు 40 మంది శివసేన ఎమ్మెల్యేలు వేరే రాష్ట్రంలో మకాం వేయడం, వారితో సీఎం ఉద్దవ్ థాకరే చర్చలు విఫలం కావడం తెలిసిందే. షిండే ఎప్పటి నుంచో శివ సైనికుడని, అతడు తమతోనే ఎప్పటికీ ఉంటాడని, చర్చలు జరుగుతున్నాయని ప్రకటించిన సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్వరం మార్చారు.

‘‘మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు విధాన సభ రద్దు దిశగా కొనసాగుతున్నాయి’’అంటూ ఆయన మరాఠీలో ఓ పోస్ట్ పెట్టారు. మహారాష్ట్రలో సంకీర్ణ ఎంవీఏ సర్కారు విధాన సభ రద్దుకు సిఫారసు చేస్తే దాన్ని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. గవర్నర్ కు ఆమోదం అయితే సభను రద్దు చేయవచ్చు. అప్పుడు తాజా ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అప్పడు బీజేపీ, ఎంఎన్ఎస్, ఇతర ప్రత్యర్థి చిన్న పార్టీలు ఒక కూటమిగా.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఒక కూటమిగా ప్రజల ముందుకు వెళ్లొచ్చు.

ఒకవేళ సభ రద్దు సిఫారసును గవర్నర్ తోసిపుచ్చితే.. అప్పుడు సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరతారు. విఫలమైతే అప్పుడు మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో లేఖ సమర్పించిన వారిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. అప్పుడు శివసేన అసమ్మతి ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అయితే, కీలకమైన సంక్షోభ సమయంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరడం గమనార్హం.

తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/