రైతుబంధు వెయ్యని వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి..? – కేటీఆర్

రైతుబంధుపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైతుబంధు అందక ఇప్పటికే రైతులు నైరాశ్యంలో ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇంకా రైతుబంధు పడలేదని ఓ రిపోర్టర్‌ ప్రశ్నించగా.. అలా అన్న వారిని చెప్పుతో కొట్టాలంటూ ఆగ్రహంతో ఊగిపోయారు మంత్రి కోమటిరెడ్డి. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మంత్రి కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.

రైతుబంధు పడలేదని అడిగితే చెప్పుతో కొడతారా? ఇంత అహంకారమా? అని కాంగ్రెస్‌ సర్కారుపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైతుబంధు ఇవ్వలేని కాంగ్రెస్‌ నాయకులను ఏ చెప్పుతో కొట్టాలని ఫైరయ్యారు. ‘రైతులారా! రైతుబంధు ఇవ్వని ఈ ప్రభుత్వాన్ని చెప్పుతో కొడతారో, ఓటుతో కొడతారో మీ ఇష్టం’ అని అన్నారు. చెప్పుతో కొడతానన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదు 420 హామీలిచ్చిందని కేటీఆర్ అన్నారు. ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ గెలిచిన ఎమ్మెల్యేలు హామీలు నెరవేర్చకపోతే బట్టలిప్పి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరెంట్ బిల్లు కట్టవద్దని రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారని.. ఆ సంగతి ఏమైందని ప్రశ్నించారు.