హైదరాబాద్‌ పోలీసుల వినూత్న ప్రయోగం

పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లకుండానే ఫిర్యాదు చేసే సౌలభ్యం

Anjani Kumar
Anjani Kumar

హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖ ఇప్పటికే ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.. తాజాగా మరో కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. ఇప్పటి వరకు ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే… పోలీస్ స్టేషన్లకు వెళ్లాల్సిందే. అయితే ఇకపై పిఎస్‌కు వెళ్లకుండానే బాధితులు ఫిర్యాదులు చేసుకునే సౌలభ్యాన్ని కల్పించింది. పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. అయితే ఈ సదుపాయం తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఇతర కమిషనరేట్లకు, జిల్లాలకు విస్తరిస్తారు.

ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఈ మేరకు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. పిఎస్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చినప్పుడు… స్టేషన్ హౌస్ ఆఫీసర్ కానీ, రైటర్ కానీ అందుబాటులో లేకపోతే… వారు వచ్చేంత వరకు బాధితులు వేచి చూసే పరిస్థితి ఉండేదని… ఇకపై ఆ ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ను విస్తృతం చేయబోతున్నామని చెప్పారు. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే ఫిర్యాదుదారులు తప్పనిసరిగా తమ పేరు, మొబైల్ నంబరు, పూర్తి చిరునామాను పోట్రోకార్ సిబ్బందికి ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ వ్యవస్థను అమల్లోకి తీసుకురావడానికి గత నెలంతా కసరత్తు చేశామని చెప్పారు.
దేశంలోనే ఈ విధానం మొట్టమొదటగా హైదరాబాదులో అమలవుతోంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/