మహిళ చేతిలో దారుణంగా మోసపోయిన పోలీస్‌ కానిస్టేబుల్‌..

మోసగాళ్లను పట్టుకునే పోలీస్ అధికారి..అదే మోసగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయిన ఘటన నంద్యాల లో చోటుచేసుకుంది. ఓ మహిళను నమ్మి.. ఏకంగా 2 కోట్ల రూపాయలు మోసపోయాడు నంద్యాలకు చెందిన ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌. ప్రస్తుతం సదరు పోలీస్‌ కానిస్టేబుల్‌ అదృశ్యం కావడం వార్తల్లో నిలిచింది.

వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా బేతంచర్లలో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న సోమ్లా నాయక్‌ కనపించకుండా పోయాడు. దీంతో సోమ్లా భార్య డోన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే సోమ్లా నాయక్‌.. తాను ఇంటి నుంచి వెళ్లిపోయేటప్పుడు ఓ నోట్‌ రాసి పెట్టి వెళ్లాడు. దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిలో సోమ్లా నాయక్‌.. తాను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో ఒక మహిళను నమ్మి.. పెద్ద ఎత్తున అప్పులు చేశానని.. కానీ సదరు మహిళ తనను మోసం చేసిందని రాసుకొచ్చాడు. ఆమెను నమ్మి తాను ఏకంగా రెండు కోట్ల రూపాయలు మోసపోయానని తన కుటుంబానికి ఎస్పీ న్యాయం చేయాలంటూ లేఖలో పేర్కొన్నాడు. చేతిలో ఉన్న సోమ్ముతో పాటు బ్యాంక్‌ లోన్లు తీసుకుని మరి తాను రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టానని సోమ్లా నాయక్‌ లేఖలో వెల్లడించారు. ఇక అప్పుల వాళ్ల ఒత్తిడి పెరగడం, పెట్టుబడి నుంచి రిటన్స్‌ రాకపోవడంతో.. తాను మోసపోయానని గ్రహించిన సోమ్లా నాయక్‌ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.