రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తున్న రేవంత్ అరెస్ట్

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేసారు. నిన్న సికింద్రాబాద్ పోలీసుల కాల్పుల్లో రాకేష్ అనే యువకుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్తున్న రేవంత్ ను ఘాట్ కేసర్ టోల్ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ.. రాకేష్ కుటుంబాన్ని పరామర్శిస్తే, రాకేష్ భౌతిక కాయానికి నివాళులు అరిస్తే.. వరంగల్ వెళ్తే పోలీసులకు వచ్చే ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రులు రాకేష్ శవయాత్ర చేయొచ్చు.. అలాగే గులాబీ జెండాలు కట్టుకొని యాత్రలో పాల్గొనవచ్చు. మేము వెళ్ళడానికి ఇన్ని అడ్డంకులా? చావులను కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోంది. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు. త్వరలో సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లేరేషన్ ప్రకటిస్తాం. ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలి. ఇది నా పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ కుటుంబాన్ని పరామర్శించాలని వెళ్తున్నది.. రాజకీయాల కోసం కాదు.. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పండి’’ అంటూ పోలీసులను ప్రశ్నించారు.

ఇక రాకేష్ విషయానికి వస్తే…వరంగల్ జిల్లాలోని ఖానాపూర్ మండలం మారుమూల డబీర్‌పేట గ్రామానికి చెందిన దామెర కుమార స్వామి, పూలమ్మ దంప‌తుల కొడుకు రాకేశ్ (21) హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్‌)లో పనిచేస్తున్న తన అక్క సంగీత నుంచి ప్రేరణ పొంది ఆర్మీలో చేరాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు.

దామెర రాకేశ్‌..రెండుసార్లు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు హాజరయ్యాడు. చిన్న కార‌ణం వ‌ల్ల ఉద్యోగం కోల్పోయాడు. అయినా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాడు. ఇటీవలే ఫిజికల్ టెస్ట్‌లలో ఉత్తీర్ణత సాధించాడు. ఎంపిక ప్రక్రియ కోసం వేచి చూస్తున్నాడు. అయితే అగ్నిపథ్ స్కీం ద్వారానే రిక్రూట్‌మెంట్‌ జరుగుతుందని తెలియగానే తీవ్ర మనస్తాపానికి గుర‌య్యాడు. హన్మకొండకు చెందిన మరో 14 మందితో కలిసి నిర‌స‌న తెలిపేందుకు హైద‌రాబాద్‌కు చేరుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఆర్పీఎఫ్ పోలీసులు జ‌రిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పాయాడు.