పట్టాభిని గన్నవరం పీఎస్ కు తీసుకొచ్చిన పోలీసులు

నేడు పట్టాభిని కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు

police-brought-pattabhi-to-gannavaram-police-station

అమరావతిః గన్నవరంలో నిన్న టిడిపి కార్యాలయంపై దాడి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు టిడిపి నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయన ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు, టిడిపి వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో, పోలీసులు పట్టాభిని ఈ మధ్యాహ్నం గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. పీఎస్ లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనను న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు.

నిన్నటి ఘటన నేపథ్యంలో, పోలీస్ స్టేషన్ కు వచ్చిన పట్టాభిని పోలీసులు అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. గన్నవరంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారంటూ పట్టాభిపై పలు సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఆయనను అరెస్ట్ చేసిన అనంతరం వాహనంలో మరో ప్రాంతానికి తరలించారు. పట్టాభి ఫోన్ స్విచాఫ్ అని వస్తుండడంతో, ఆయనను ఎక్కడికి తరలిస్తున్నారన్నది తెలియరాలేదు. ఓ దశలో వీరవల్లికి తరలిస్తున్నారని, హనుమాన్ జంక్షన్ కు తరలిస్తున్నారని ప్రచారం జరిగింది. భర్త ఆచూకీ తెలియడంలేదంటూ పట్టాభి అర్ధాంగి చందన మీడియా ముందుకు కూడా వచ్చారు.