జాతినుద్దేశించి ప్రధాని మోడి ప్రసంగం

ముప్పు ఇంకాతొలగిపోలేదు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..ప్రధాని

YouTube video
PM Shri Narendra Modi’s address to the nation

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈ సాయంత్రం జాతినుద్దేశించి ప్రసగించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ… క‌రోనాతో భార‌త్ పోరాటం చేస్తుంద‌న్నారు. క‌రోనా వ్యాప్తిని మ‌నం స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకోగ‌లిగామ‌న్నారు. క‌రోనా నుంచి మ‌నం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామ‌న్నారు. మ‌న దేశంలో రిక‌వ‌రీ రేటు ఎక్కువ‌.. మ‌ర‌ణాల రేటు త‌క్కువని తెలిపారు. దేశంలో 10 ల‌క్ష‌ల మందిలో ఐదున్న‌ర వేల మందికే క‌రోనా సోకిందన్నారు. అదే అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో 10 ల‌క్ష‌ల మందిలో 25 వేల మందికి సోకిన‌ట్లు వెల్ల‌డించారు. క‌రోనా ప‌రీక్ష‌ల కోసం దేశ‌వ్యాప్తంగా 2 వేల ల్యాబ్‌లు ప‌నిచేస్తున్న‌ట్లు తెలిపారు. దేశంలో 90 ల‌క్ష‌లకు పైగా కొవిడ్ బెడ్లు అందుబాటులో ఉన్న‌ట్లు చెప్పారు.

క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని సూచించారు. చాలా మంది మాస్కులు లేకుండా బ‌‌య‌ట ‌తిరుగుతున్నారు. మాస్కులు లేకుండా తిరిగితే మీ కుటుంబాన్ని రిస్క్‌లో పెట్టిన‌ట్లేన‌న్నారు. క‌రోనాపై పోరాటం సుదీర్ఘ‌మైందన్నారు. క‌రోనా త‌గ్గింద‌ని భావిస్తే తీవ్ర ప‌రిణామాల‌కు దారితీస్తుందన్నారు. క‌రోనాపై విజ‌యం సాధిస్తున్నాం కాబ‌ట్టి అల‌స‌త్వం ప‌నికిరాదన్నారు. కేసులు త‌గ్గాయి కాబ‌ట్టి క‌రోనా పోయిందని భావించొద్ద‌న్నారు. ఇది పండుగ‌ల సీజ‌న్ మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. పండుగ‌ల వేళ ప్ర‌జ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌ధాని సూచ‌న‌లు చేశారు. మాస్కు ధ‌రించ‌డం, ఆర‌డుగుల దూరం త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌న్నారు. క‌రోనా వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు మ‌న పోరాటం ఆగ‌కూడదని ప్ర‌ధాని పేర్కొన్నారు.

మన జాగ్రత్తలు, మన సంప్రదాయాలే కరోనా ప్రభావాన్ని గణనీయంగా తగ్గించేందుకు కారణమయ్యాయని తెలిపారు. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి సంపన్న దేశాలు సైతం కరోనా వైరస్ పట్ల అజాగ్రత్తగా వ్యవహరించి మూల్యం చెల్లించాయని అభిప్రాయపడ్డారు. దేశంలో కరోనా కారక మరణాల రేటు తక్కువగా ఉందని వెల్లడించారు. అగ్రదేశాలతో పోల్చితే మనదేశంలో కరోనా మరణాల రేటు తక్కువ అని వెల్లడించారు.

కరోనా తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కుదుటపడుతోందని వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగనిద్దాం అని అన్నారు. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికుల కృషి ఫలితమే దేశంలో కరోనా ప్రభావం గణనీయంగా తగ్గిందని చెబుతూ ముందు నిలిచిపోరాడుతున్న వారిని కొనియాడారు. దేశంలో వైద్యం కోసం ఆందోళన చెందాల్సిన అవసరంలేదని మోడి స్పష్టం చేశారు. దేశం ఇప్పుడిప్పుడే విపత్కర పరిస్థితులను అధిగమిస్తోందని పేర్కొన్నారు.

అయితే, భారత్ ఇంకా ముప్పు తొలగిపోలేదని, రాబోయేది పండుగల సీజన్ కావడంతో పెనుగండం పొంచి ఉందని భావించాలని స్పష్టం చేశారు. కరోనా ఇంకా వెంటాడుతూనే ఉందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. పండుగ సీజన్ వచ్చిందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం ఎక్కువగా జరుగుతుంటుందని తెలిపారు. ఇలాంటి సమయాల్లోనే అప్రమత్తం ఉండాలని సూచించారు. వ్యాక్సిన్ వచ్చేంత వరకు అప్రమత్తతే రక్ష అని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రజలందరికీ అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని వెల్లడించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/