దళిత బంధు కోసం రూ.600 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్

దళిత బంధు కోసం రూ.600 కోట్లను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటివరకు ఎంపికైన లబ్ధిదారులందరికీ ఎస్సీ కార్పోరేషన్ ఆర్థిక సాయాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో ఇప్పటివరకు 38,476 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. ప్రస్తుతం ఎంపికైన లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటివరకు రూ.3,847.6 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకునేందుకు ఈ పథకాన్ని తీసుకు వచ్చింది ప్రభుత్వం. ప్రస్తుతం ఈ పథకం నూటికి నూరుశాతం విజయవంతంగా కొనసాగుతోంది.

ముందుగా ఈ పథకం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఉపఎన్నిక వేళ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆ నియోజకవర్గంలో మొత్తం 18,211 కుటుంబాలను గుర్తించిన యంత్రాంగం.. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున అర్హులందరి ఖాతాల్లో నిధులను జమ చేసింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామంలో ఉన్న 75 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం అమలు చేశారు. ఆ తర్వాత చింతకాని, తిరుమలగిరి, చారగొండ, నిజాంసాగర్‌ మండలాలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఆయా మండలాల్లోని దళిత కుటుంబాలన్నింటికీ సాయం అందించాలని నిర్ణయించి ఆ మేరకు అర్హులను ఎంపిక చేశారు.