నేడు కచ్‌లో ప్రధాని మోడి పర్యటన

pm modi

అహ్మదాబాద్‌: ప్రధాని నరేంద్రమోడి నేడు గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశం కావడంతో పాటు పలు అభివృద్ధి పనులకు పునాది రాయి వేయనున్నారు. డీశాలినేషన్ ప్లాంట్, హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన పార్క్, ఆటోమేటెడ్ పాల ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారని ప్రధాని కార్యాలయం (పీఎంఓ) తెలిపింది. కచ్‌లోని మాండ్వి వద్ద రాబోయే డీశాలినేషన్ ప్లాంట్‌తో సముద్రపు నీటిని తాగునీటిగా మార్చనున్నారు. విఘాకోట్ గ్రామానికి సమీపంలో ఉన్న హైబ్రిడ్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ దేశంలో అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ఉత్పాదక ఉద్యానవనంగా నిలువనుంది.

72,600 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కులో గాలి, సౌర శక్తి నిల్వ కోసం ప్రత్యేక హైబ్రిడ్ పార్క్ జోన్ ఉండనుంది. అలాగే విండ్ పార్క్ కార్యకలాపాలకు ప్రత్యేకమైన జోన్ ఉంటుంది. కచ్‌లోని సర్హాద్ డెయిరీ అంజార్ వద్ద పూర్తిగా ఆటోమేటెడ్ పాల ప్రాసెసింగ్, ప్యాకింగ్ ప్లాంట్‌కు పునాది రాయి పడనుంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.121 కోట్లు ఖర్చు చేయనున్నారు. రోజుకు 2 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/