గజమాలలు వేసినంత మాత్రాన నేను సీఎంను కాను.. పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరి లో ఏర్పాటు పార్టీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. మరోసారి పొత్తులపై స్పష్టత ఇచ్చారు. టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చేసేందుకు జనసేన లేదని, కుల రాజకీయాలు చేయనని పవన్ కళ్యాణ్ అన్నారు. పొత్తులు కూడా రాజకీయంలో భాగమేనని, టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. వైస్సార్సీపీ అవినీతి, అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని, ఆ పార్టీకి మళ్లీ ఓటు వేస్తే రాష్ట్రం ఇప్పట్లో కోలుకోలేదని, తమకు ఉమ్మడి ప్రత్యర్థి వైస్సార్సీపీ నేనని పేర్కొన్నారు.

అభిమానులు నినాదాలతో సీఎం అవ్వలేరని ఓట్లు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రోడ్ల మీదకొచ్చి తనకు గజమాలలు వేసి, హారతులు ఇస్తే సరిపోదని.. ఓట్లు కూడా వేయాలని అన్నారు. 150 మందితో పదేండ్ల క్రితం పార్టీని ప్రారంభించామని.. ఇప్పుడు 140 నియోజకవర్గాల్లోని మండలాలకు ఇప్పుడు అధ్యక్షులు ఉన్నారు.. మిగిలిన 35 నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే నియమిస్తామని తెలిపారు. తాను నాయకత్వపు బాధ్యలు వహిస్తున్న కార్యకర్తను మాత్రమేనని స్పష్టం చేశారు. తాను మార్పును, పరివర్తనను కోరుకునే వ్యక్తినని తెలిపారు.

డబ్బు లేకుండా రాజకీయం చేయవచ్చని నిరూమించామని, ఓట్లు కొనకుండా రాజకీయం చేయాలనే చెప్పానని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్‌పై కూడా పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ బాగుండాలంటే ఏం చేయాలని ఆలోచిస్తా.. తప్ప తాను బాగుండాలంటే ఏం చేయాలని ఎప్పుడూ ఆలోచించనని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఏపీ బాగుంటే పవన్‌ కల్యాణ్‌ బాగుంటాడు.. ఏపీ బాగుంటే పవన్‌ కల్యాణ్‌ ముఖ్యమంత్రి అవుతాడు అని ఆలోచించాలి అని అన్నారు. నినాదాలతో సీఎం అవ్వలేరని.. ఓట్లు వేస్తేనే సీఎం అవుతామని చెప్పారు. ఎక్కడికి వెళ్లిన విపరీతమైన ఆరాధన, ప్రేమ చూపిస్తుంటారు.. ఆ ప్రేమ, ఆరాధన ఓట్ల కింద మారనప్పుడు ఎంత ప్రజాదరణ ఉన్న నిష్ప్రయోజనమే అన్నారు. అది టీవీలు, టీఆర్పీలకు బాగుంటుంది తప్ప అధికారం దిశగా వెళ్లమని పవన్ అన్నారు.