భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందిః ప్రధాని మోడీ

pm-modi-speech-in-sangareddy-today

హైదరాబాద్‌ః సంగారెడ్డి జిల్లాలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదట పటేల్‌గూడ నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం అక్కడ రాష్ట్రాభివృద్ధి, రాష్ట్రాలకు కేంద్రం సహకారంపై మాట్లాడారు. అనంతరం ఆయన బిజెపి విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సభలో మోడీ మరోసారి తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నా తెలంగాణ కుటుంబసభ్యులందరికీ నమస్కారాలు అంటూ ప్రసంగం షురూ చేశారు.

అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణలో బిజెపి పట్ల ఆదరణ పెరుగుతోందిని అన్నారు. మీ ఆశీర్వాదాలు వృథా కానివ్వను.. ఇది మోడీ గ్యారంటీ అని హామీ ఇచ్చారు. మోడీ ఏదైతే చెబుతాడో అదే చేసి చూపుతాడని అన్నారు. భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేర్చాలన్న ప్రధాని.. భారత్‌ ప్రపంచానికి ఆశాకిరణంలా మారిందని పునరుద్ఘాటించారు.

“ప్రపంచ దేశాల్లో తెలుగు ప్రజలు కీలకభూమిక పోషిస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆర్టికల్‌ 370 రద్దు హామీ అమలు చేశాం. అయోధ్య రామ మందిరం నిర్మించి తీరుతామని చెప్పాం. ప్రపంచం గర్వించే రీతిలో అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన జరిగింది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా తీర్చిదిద్దడమే మరో గ్యారంటీ.” అని ప్రధాని మోడీ అన్నారు.

అవినీతిని బయటపెడుతున్నాననే అక్కసుతో కాంగ్రెస్‌ విమర్శిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. కుటుంబ పాలన సాగించే వారిలో అభద్రతా భావం ఎక్కువన్న ఆయన వారసత్వ నేతలకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. కుటుంబ పార్టీల నేతలు సొంత ఖజానా నింపుకుంటున్నారని ఆరోపించారు. వారి అవినీతి దళాన్ని వెలికితీస్తున్నానని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నేనెప్పుడూ వమ్ము కానివ్వనన్న ప్రధాని, కొంతమంది నేతలు దోచుకున్న నల్లధనం దాచుకోవడానికే విదేశాల్లో ఖాతాలు తెరిచారని ఆరోపణలు చేశారు.

140 కోట్ల మంది ప్రజలే తన కుటుంబం అని మోడీ అన్నారు. మేమంతా మోడీ కుటుంబమే అని తెలంగాణ ప్రజలు అంటున్నారని తెలిపారు. నేనే మోడీ కుటుంబం అని సభికులతో ప్రధాని నినాదాలు చేయించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ యువత స్వప్నాలను సాకారం చేస్తానని హామీ ఇచ్చారు. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ చేయలేని పనిని పదేళ్లలో చేసి చూపామని, కోట్లాది ఎస్సీ యువత స్వప్నాలను సాకారం చేశామని తెలిపారు. తెలంగాణలో బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు.